PC: IPL Twitter
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (మే 7) జరిగిన హైటెన్షన్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్ గెలవడం.. అంతా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయతీరాలకు చేర్చింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి, గెలుపు ట్రాక్‌లో ఉంచింది మాత్రం డైనమైట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్.
ఈ కివీస్ బ్యాటర్.. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావాల్సిన తరుణంలో సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 25) ఆడి అసాధ్యమనుకున్న గెలుపుపై ఆశల రేకెత్తించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచిన ఫిలిప్స్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఫిలిప్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా ఓటమిపాలై, లీగ్ నుంచి నిష్క్రమించేది.
ఫిలిప్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ ఫిలిప్స్.. సనరైజర్స్ హ్యారీ బ్రూక్‌ను వదిలించుకుని నీకు అవకాశమిచ్చి మంచి పని చేసిందంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 13.25 ఆటగాడి (బ్రూక్) కంటే అందులో పది శాతం (1.5 కోట్లు) కూడా రేటు దక్కని ఫిలిప్స్ చాలా బెటరని అంటున్నారు.
కేకేఆర్‌పై బ్రూక్ చేసిన సెంచరీ కంటే రాజస్థాన్‌పై ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమని కొనియాడుతున్నారు. సెంచరీ మినహాయించి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విఫలమైన బ్రూక్‌ను ఇకపై పక్కకు పెట్టి ఫిలిప్స్‌నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు మినుకమినుకుమంటున్న దశలో ఫిలిప్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ను ఫైనల్ ఫోర్‌కు చేరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్ సంజు శాంసన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్‌ను గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్‌రైజర్స్
Comments
Please login to add a commentAdd a comment