పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్‌నీల్ బార్ట్‌మన్ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.
వన్డే సిరీస్‌లో విఫలం
కాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.
ఇక జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్‌నీల్ బార్ట్‌మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
మోకాలి నొప్పి వల్ల
రెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్‌మన్‌కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఆల్‌రౌండర్‌కు పిలుపు
ఇక పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్ స్థానంలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.
పాకిస్తాన్‌దే వన్డే సిరీస్
కేప్‌టౌన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్‌పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.
కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్‌రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment