SA Vs PAK: రీజా హెండ్రిక్స్‌ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా | WSA Vs PAK: Reeza Hendricks Slams Maiden T20I Ton Seals Series Win For SA Vs Pakistan, Check Out More Insights | Sakshi
Sakshi News home page

SA Vs PAK: రీజా హెండ్రిక్స్‌ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

Published Sat, Dec 14 2024 9:00 AM | Last Updated on Sat, Dec 14 2024 9:43 AM

SA vs Pak: Reeza Hendricks Maiden T20I Ton Seals Series Win vs Pakistan

పాకిస్తాన్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో ప్రొటీస్‌ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.

సయీమ్‌ ఆయుబ్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. సెంచరీ మిస్‌
ఇందులో భాగంగా డర్బన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్‌ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(11) విఫలం కాగా.. సయీమ్‌ ఆయుబ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్‌  పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్‌ ఖాన్‌(16 బంతుల్లో 30) రాణించారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, డయాన్‌ గాలియెమ్‌ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఇక పాక్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

రీజా హెండ్రిక్స్‌ విధ్వంసం.. ‘తొలి’ శతకం
పాక్‌ యువ పేసర్‌ జహన్‌బాద్‌ ఖాన్‌ ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌ను రెండు పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మాథ్యూ బ్రీట్జ్‌(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ విధ్వంసం ముందు పాక్‌ బౌలర్లు తలవంచకతప్పలేదు.

రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్‌ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం.

సిరీస్‌ సౌతాఫ్రికా కైవసం
ఇక రీజాకు తోడుగా రాసీ వన్‌ డెర్‌ డసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్‌.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్‌ బౌలర్లలో జహన్‌బాద్‌ ఖాన్‌కు రెండు, అబ్బాస్‌ ఆఫ్రిదికి ఒక వికెట్‌ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్‌ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్‌ స్టేడియం ఇందుకు వేదిక.

చదవండి: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement