జొహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న మార్క్రమ్.. వెస్టిండీస్‌తో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు (తొలి ఇన్నింగ్స్) సాధించింది.
మార్క్రమ్ (139 బంతుల్లో 96; 17 ఫోర్లు), టోనీ డి జార్జి (155 బంతుల్లో 86; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మార్క్రమ్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి వికెట్‌కు డీన్ ఎల్గర్ (54 బంతుల్లో 42; 7 ఫోర్లు)తో కలిసి 76 పరుగులు, రెండో వికెట్‌కు టోనీ డి జార్జితో 116 పరుగులు జోడించిన మార్క్రమ్.. క్రీజ్‌లో ఉన్నంత సేపు విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
సఫారీ బ్యాటర్లలో బవుమా (28), ర్యాన్ రికెల్టన్ (22), వియాన్ ముల్దర్ (12), సైమన్ హార్మర్ (1) తక్కువ స్కోర్‌కే పరిమితం కాగా, ఆట ముగిసే సమయానికి హెన్రిచ్ క్లాసెన్ (17), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లు, కైల్ మేయర్స్ రెండు వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విండీస్, టూర్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు చేతిలో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment