భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్‌లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్‌ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్‌ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్‌పై ప్రకటన చేశారు.
షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య
అయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) లీగ్‌కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.
రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్
కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్‌కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్‌గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.
త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం
అదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్‌లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్‌తో రెజ్లింగ్‌కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్‌మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.
లీగ్‌కు గుర్తింపు లేదు
కానీ డబ్ల్యూఎఫ్‌ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్‌కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్‌తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment