డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్‌పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా?
భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు.
మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్‌తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది.
దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్‌దబా థా... దబ్‌దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఊహించిన ఫలితమే!
ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్‌కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్‌గా వచ్చింది.
జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి.
నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది.
కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్‌భూషణ్‌సింగ్‌పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది.
నిబంధనలను ఉల్లంఘించి...
అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని నందిని నగర్‌ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం.
చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్‌ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది.
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు.
జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి
ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్‌లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్‌పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం.
అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం.
– జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు;
– ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment