కొన్నాళ్ల క్రితం బౌట్‌లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్‌నెస్’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్‌నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది.
బౌట్‌లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్‌తక్‌లోని అఖాడాలో రెజ్లింగ్ నేర్చుకోవడం, దాన్ని కెరీర్‌గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి.
వెన్నుచూపని తీరు
ఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది.
పురుషాధిక్య భారత రెజ్లింగ్ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment