విజేత గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ జట్టు
ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: రెండోరోజు సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శేరిగూడలోని శ్రీఇందు కాలేజీ వేదికగా కొనసాగుతున్న మ్యాచ్‌లకు ఆదివారం ఆయా విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సాక్షి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకొని ప్రతిభను చాటాలన్నారు. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్‌మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.
రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు
రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో దిల్‌సుఖ్‌నగర్ అవంతి పీజీ కళాశాల, ఘట్‌కేసర్ వీబీఐటీ జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అవంతి కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వీబీఐటీ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి విజయం సాధించింది.
రెండో మ్యాచ్ శేరిగూడ శ్రీఇందు ఇన్‌స్టిట్యూట్, ఘట్‌కేసర్ శ్రీనిధి కళాశాల జట్లు పోటీ పడ్డాయి. శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీఇందు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు సాధించింది. అనంతరం శ్రీనిధి కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. శ్రీఇందు జట్టులో శివ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసి 22 బాల్స్‌కు 41 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
శ్రీఇందు ఇన్‌స్టిట్యూట్ జట్టును విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ అభినందించారు. మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ ఓయూ జట్టు, ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఓయూ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గురునానక్ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 56 పరుగులు సాధించి విజేతగా నిలిచింది.
నాలుగో మ్యాచ్‌లో అల్వాల్ లయోలా డిగ్రీ కళాశాలతో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల పోటీపడ్డాయి. టాస్ గెలిచిన లయోలా జట్టు వెస్లీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. 10 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి వెస్లీ జట్టు 50 పరుగులు చేసింది. అనంతరం లయోలా జట్టు 8.2 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు సాధించి విజయాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment