హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరుకుంది. ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించడంతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తుది పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరో 3 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ పాయింట్ల ఆధారంగా (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింటుల) ఇన్విన్సిబుల్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఇదివరకే లీగ్ నుంచి ఎలిమినేట్ కాగా, మరో ఫైనల్ బెర్త్ కోసం మాంచెస్టర్స్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్, సథరన్ బ్రేవ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్.. కొలిన్ మున్రో (25 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), గ్రెగరీ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు), డేనియల్ సామ్స్ (9 బంతుల్లో 19నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓవల్ బౌలర్లలో టామ్ కర్రన్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, అట్కిన్సన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
శివాలెత్తిన సామ్ బిల్లింగ్స్..
149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓవల్ టీమ్.. మరో 8 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓవల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. అతనికి జేసన్ రాయ్ (19), విల్ జాక్స్ (31), టామ్ కర్రన్ (18 నాటౌట్) సహకరించారు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, లూక్ వుడ్, సామ్ కుక్, మాథ్యూ కార్టర్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment