మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌..! | Sanath Jayasuriya As Head Coach, Sri Lanka Beat England And India | Sakshi
Sakshi News home page

మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌..!

Published Mon, Sep 9 2024 6:15 PM | Last Updated on Mon, Sep 9 2024 6:26 PM

Sanath Jayasuriya As Head Coach, Sri Lanka Beat England And India

హెడ్‌ కోచ్‌ సనత్‌ జయసూర్య ఆథ్వర్యంలో శ్రీలంక క్రికెట్‌ జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే భారత్‌కు వన్డే సిరీస్‌లో షాకిచ్చిన (0-2 తేడాతో) శ్రీలంక.. తాజాగా ఇంగ్లండ్‌కు వారి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. జయసూర్య హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక శ్రీలంక ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. 

ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. జయసూర్య పర్యవేక్షణలో కమిందు మెండిస్‌, పథుమ్‌ నిస్సంక, మిలన్‌ రత్నాయకే లాంటి యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉండింది. 

మూడో టెస్ట్‌లో నిస్సంకకు అవకాశం ఇచ్చి జయసూర్య పెద్ద సాహసమే చేశాడు. సత్ఫలితం రాబట్టాడు. మూడో టెస్ట్‌లో నిస్సంక తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ.. ఛేదనలో మెరుపు సెంచరీ చేసి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా జయసూర్య శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.

కాగా, కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది.

నిస్సంక సూపర్‌ సెంచరీ
219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్‌ నిస్సంక సూపర్‌ సెంచరీతో (127 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.

పోప్‌ భారీ శతకం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్‌ డకెట్‌ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్‌ (64) అర్ద సెంచరీలతో రాణించారు.

ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్‌ రత్నాయకే ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ జేమీ స్మిత్‌ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement