కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక‌: అతియా శెట్టి పోస్ట్ వైర‌ల్‌ | Sakshi
Sakshi News home page

కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక‌.. అతియా శెట్టి పోస్ట్ వైర‌ల్‌

Published Tue, May 14 2024 5:43 PM

Sanjiv Goenka Invites KL Rahul Home Hugs Him Athiya Shetty Post Goes Viral

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మాని, బ‌డా వ్యాపార‌వేత్త సంజీవ్ గోయెంక న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను త‌న ఇంటికి ఆహ్వానించి.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.  ఈ క్ర‌మంలో రాహుల్‌ను ఆయ‌న ఆత్మీయంగా హ‌త్తుకున్న ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్‌-2022లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అడుగుపెట్టిన ల‌క్నో ఫ్రాంఛైజీ త‌మ సార‌థిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌ను నియ‌మించింది. ఈ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కెప్టెన్సీలో ల‌క్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గ‌తేడాది సైతం టాప్‌-4తో ముగించింది.

ఈ క్ర‌మంలో ప‌దిహేడో ఎడిష‌న్‌లోనూ స‌త్తా చాటాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ల‌క్నో ఓడిపోయింది.

అంద‌రూ చూస్తుండ‌గానే చీవాట్లు
ఈ మ్యాచ్‌లో ప్యాట్ క‌మిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేన‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో ప‌లు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్‌పై తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

మైదానంలో అంద‌రూ చూస్తుండ‌గానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ కావ‌డంతో సంజీవ్ గోయెంక తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  కెప్టెన్ ప‌ట్ల ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ మాజీ క్రికెట‌ర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు.

డిన్న‌ర్ కోసం త‌న ఇంటికి ఆహ్వానించి
ఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మ‌గౌర‌వం నిల‌బ‌డాలంటే వెంట‌నే ల‌క్నోకు గుడ్‌బై చెప్పాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజా ఫొటో తెర మీద‌కు వ‌చ్చింది. కేఎల్ రాహుల్‌ను డిన్న‌ర్ కోసం త‌న ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అత‌డిని ఆలింగనం చేసుకున్నాడు.

 

తుపాన్ వెలిసిన త‌ర్వాత
ఈ నేప‌థ్యంలో గోయెంక‌- రాహుల్ మ‌ధ్య స‌ఖ్య‌త కుదిరింద‌ని.. జ‌ట్టులో ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య‌, న‌టి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన త‌ర్వాత ప్ర‌శాంతంగా ఇలా అంటూ ఆమె మ‌బ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా ల‌క్నో మంగ‌ళ‌వారం ఢిల్లీతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మ‌రో మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు ఇందుకోసం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement