శార్దూల్ ఠాకూర్- రాహుల్ ద్రవిడ్ (PC: BCCI)
దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.
కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు.
అలా అయితే కష్టమే కదా
తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం.
ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్‌లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్‌లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు.
శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే
ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్‌పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే.
కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment