సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. | Sehwag Tells BCCI Selectors To Consider 36-Year-Old-Pacer In Team India | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

May 2 2026 8:50 PM | Updated on May 2 2026 9:06 PM

Sehwag Tells BCCI Selectors To Consider 36-Year-Old-Pacer In Team India

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్‌ పదును చూపిస్తూ ఐపీఎల్‌ 2026 సీజన్లో‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్‌ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్‌  ఓపెనర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్‌లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్‌ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్‌లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గ‌తేడాది (2025) ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్‌లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్‌కు నిదర్శనం. ఆర్‌సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.

ఇటీవలే అతను టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా, రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.

చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

Advertisement
 
Advertisement
Advertisement