భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టీకరణ
సూటిగా, మొహమాటానికి తావు లేకుండా... భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో భవిష్యత్తు గురించి తన ఆలోచనలేమిటో చెప్పేశాడు. సీనియర్ ఆటగాళ్లయినా సరే తమకు నచ్చినట్లుగా సిరీస్‌లు ఆడతామంటే కుదరదని స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాను అని చెబుతూ ఫిట్‌నెస్ ఉంటేనే అంటూ అది సాధ్యమవుతుందని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చే ఫలితాలు రాబడతానన్న గంభీర్... విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించాడు.
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. శనివారం నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అతను బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తొలిసారి మీడియాతో అన్ని విషయాలపై మాట్లాడాడు. టీమిండియా భవిష్యత్తు, తన ప్రణాళికల గురించి వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే...
కోచ్‌గా తన ఆలోచనలపై...
నేను ఒక విజయవంతమైన జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాను. టి20 వరల్డ్ చాంపియన్, వన్డేలు, టెస్టుల్లో రన్నరప్ టీమ్ ఇది. అనూహ్య మార్పులతో నేను పరిస్థితిని చెడగొట్టను. ఒక హెడ్ కోచ్, ఆటగాడి మధ్య ఉండే బంధం తరహాలో కాకుండా వారికి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. పరస్పర నమ్మకంతోనే ఫలితాలు వస్తాయి.
నేను అన్ని సమయాల్లో ఆటగాళ్లకు అండగా నిలుస్తా. ఏం చేసినా జట్టు గెలుపే లక్ష్యం కావాలి. వేరే మాటకు తావు లేదు. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శించాలి. విజయాలు లభిస్తేనే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం సంతోషంగా ఉంటుంది. నేను అడిగిన సహాయక సిబ్బందిని ఇచి్చన బోర్డుకు కృతజ్ఞతలు.
ఆటగాళ్లు సిరీస్‌లు ఎంచుకోవడంపై...
నా దృష్టిలో బుమ్రాలాంటి బౌలర్లకు మాత్రమే విశ్రాంతి అవసరం. ప్రతీ ఒక్కరు జట్టులో ఉండాలనుకునే బుమ్రా ఒక అరుదైన బౌలర్. కాబట్టి అతడిని, ఇతర పేసర్లకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే గానీ బ్యాటర్లకు పని భారం అనేది ఉండదు.
నిలకడగా ఆడుతూ ఫామ్‌లో ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు. రోహిత్, కోహ్లి ఇప్పుడు రెండు ఫార్మాట్‌లే ఆడుతున్నారు కాబట్టి వారు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండవచ్చు. ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఒక సిరీస్‌లో ఆడతామని, మరో సిరీస్‌లో ఆడమని అంటే కుదరదు.
రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై...
వారిద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నా భావన. వారు జట్టుకు ఎంత విలువైన ఆటగాళ్లో అందరికీ తెలుసు. ఏ జట్టయినా తమకు అలాంటి ఆటగాళ్లు కావాలని కోరుకుంటుంది. ఫిట్‌గా ఉంటే మాత్రం రోహిత్, కోహ్లి 2027 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆడవచ్చు. జట్టుకు ఉపయోగపడగలమనే భావన వారిలో ఉంటే ఎప్పటి వరకు ఆడగలరనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే చివరికి ఏదైనా జట్టు కోసమే.
కోహ్లితో విభేదాలపై...
నాకు, విరాట్‌కు మధ్య ఎలాంటి బంధం ఉందనేది మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇది జనం ముందు చూపించేది కాదు. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం ఏదైనా చెప్పుకోవచ్చు. మైదానంలో తన జట్టు కోసం పోరాడే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మేం భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాం. జట్టు గెలుపు కోసమే ప్రయతి్నస్తాం. అది మా బాధ్యత. నేను కోచ్‌గా ఎంపికయ్యాక, అంతకుముందు కూడా చాలా మాట్లాడుకున్నాం. అత్యుత్తమ ఆట గాడైన కోహ్లి అంటే నాకు ఎంతో గౌరవం ఉంది.
‘సూర్యను అందుకే కెప్టెన్ ను చేశాం’
భారత టి20 కెప్టెన్ గా అయ్యే అర్హత అతనికి అన్ని విధాలా ఉంది. ఈ ఫార్మాట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్. గత ఏడాది కాలంగా అతని గురించి, నాయకత్వ లక్షణాల గురించి డ్రెస్సింగ్ రూమ్ సహచరులు కూడా గొప్పగా చెప్పారు. జట్టు సారథి అన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటాం. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక ఆటగాడే. ఆల్‌రౌండర్‌గా అతని సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఫిట్‌నెస్ సమస్యలే ప్రధాన బలహీనత. గత కొంత కాలంగా అతను వీటిని ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్‌లు ఆడే నైపుణ్యంతో పాటు శుబ్‌మన్ గిల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే వైస్‌కెప్టెన్ ను చేశాం. అతను మరింత నేర్చుకుంటాడు. అక్షర్‌కు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వడం కోసమే జడేజాకు విరామం ఇచ్చాం తప్ప అతడిని తప్పించలేదు.
పంత్, రాహుల్ ఉన్నాక మరో కీపర్ అవసరం లేదు కాబట్టి సామ్సన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్ కప్ కోణంలో కొన్ని ప్రయోగాలతో కొత్తగా ప్రయతి్నస్తున్నాం. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. –అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment