కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి | Shah Rukh Khan Chat With Venky Mysore After Lost Wickets Vs Punjab | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి

Apr 7 2026 8:02 AM | Updated on Apr 7 2026 8:35 AM

Shah Rukh Khan Chat With Venky Mysore After Lost Wickets Vs Punjab

ఐపీఎల్‌లో మూడుసార్లు చాంపియ‌న్ అయిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) 2026 సీజ‌న్‌లో మాత్రం ఇంకా బోణీ చేయ‌లేదు. సోమ‌వారం పంజాబ్‌తో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావ‌డంతో ఒక పాయింట్ సాధించిన‌ప్ప‌టికీ విజ‌యం మాత్రం ఇంకా ఆ జ‌ట్టు ద‌రి చేర‌లేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. 

ఈ నేప‌థ్యంలో కేకేఆర్ స‌హ య‌జ‌మాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జ‌ట్టుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగిపోయిన స‌మ‌యంలో కెమెరాలు ఒక్క‌సారిగా డ్రెసింగ్ రూమ్‌వైపు తిరిగాయి. అప్ప‌టికే అక్క‌డ షారుక్ ఖాన్ కేకేఆర్ సీఈవో వైంకీ మైసూర్‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లో మునిగిన‌ట్లు క‌నిపించింది. 

ముఖ్యంగా సీజ‌న్‌లో కేకేఆర్ ఆట‌తీరుపై, కామెరున్ గ్రీన్ వైఫ‌ల్యంపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంపై కూడా షారుక్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. మ్యాచ్‌ జరిగి ఉంటే కేకేఆర్‌ తక్కువ స్కోరుకే వెనుదిరిగేదేమో అని భావించినట్లు తెలుస్తోంది.

ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఓట‌ముల‌పై కూడా విశ్లేషించిన‌ట్లుగా అర్థ‌మవుతోంది.  మొత్తంగా కేకేఆర్‌ ప్లాఫ్‌ షోపై షారుక్‌ ఖాన్‌ అసం తృప్తిగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 220 ప‌రుగుల భారీ స్కోరు చేసినప్ప‌టికీ కేకేఆర్ ఓడిపోయింది. బౌలింగ్ వైఫ‌ల్యంతో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ ట్టుకుంది. 

ఇక సొంత మైదానంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈసారి బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఓట‌మి చ‌విచూసింది. 227 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ 161 ప‌రుగుల‌కే ఆలౌటైంది. క‌నీసం మూడో మ్యాచ్ ద్వారానైనా సీజ‌న్‌లో బోణీ కొట్టాల‌ని భావించిన కేకేఆర్ ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. 

మ్యాచ్ ర‌ద్దుతో ఒక పాయింట్ ల‌భించిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేదు. క‌నీసం ఏప్రిల్ 9న ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లోనైనా కేకేఆర్ విజ‌యం సాధించి సీజ‌న్‌లో ఖాతా తెర‌వ‌డంతో పాటు షారుక్ ఖాన్ శాంతించేలా చేస్తుందేమో చూడాలి. 

చదవండి: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!

Advertisement
 
Advertisement
Advertisement