
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు 9 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తన స్పిన్ మాయాజాలంతో షకీబ్ ముప్పుతిప్పులు పెట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 36 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లక్ష్య చేధనలో కూడా షకీబ్ 29 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు.
టీమిండియాపై అరుదైన ఘనత
ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో భారత్‌పై ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా టీమిండియాపై వన్డే మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా షకీబ్ నిలిచాడు.
గతంలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డును షకీబ్ తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేలో భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్‌గా షకీబ్ అల్ హసన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ యాష్లే గైల్స్ పేరిట ఉండేది. 2002లో ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన వన్డేలో గైల్స్ 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.
చదవండి: మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ