T20 World Cup 2022 IND Vs BAN Match Live Score Updates, Highlights And Latest News - Sakshi
Sakshi News home page

T20 WC 2022: మరో ఉత్కంఠ సమరం.. బంగ్లా పులుల మెడలు వంచిన టీమిండియా

Published Wed, Nov 2 2022 1:07 PM | Last Updated on Wed, Nov 2 2022 6:04 PM

T20 WC 2022: India Vs Bangladesh Match Updates And Highlights - Sakshi

మరో ఉత్కంఠ సమరం.. బంగ్లా పులుల మెడలు వంచిన టీమిండియా 
టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఉత్కంఠ సమరం జరిగింది. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-2లో అగ్రస్థానానికి ఎగబాకడంతో పాటు సెమీస్‌ అవకాశాలను దాదాపుగా ఖరారు చేసుకుంది. 

108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌

టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేస్తుండటంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 13వ ఓవర్‌లో హార్ధిక్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్‌ 108 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది.  

షకీబ్ ఔట్‌
వర్షం తర్వాత ఆట మొదలయ్యాక టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. వరుస వికెట్లు పడగొడుతూ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అర్షదీప్‌ 12వ ఓవర్‌లో రెండో వికెట్‌ తీశాడు. హుడా అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో షకీబ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 100 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. 

మూడో వికెట్‌ డౌన్‌
బంగ్లాదేశ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ క్యాచ్‌ పట్టడంతో అఫీఫ్‌ హొసేన్‌ (3) పెవిలియన్‌ బాట పట్టాడు. 11.1 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 99/3గా ఉంది. 

రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌
వేగంగా పరుగులు సాధించే క్రమంలో బంగ్లాదేశ్‌ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 10వ ఓవర్లో బంగ్లా రెండో వికెట్‌ కోల్పోయింది షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి షాంటో (21) ఔటయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 84 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
వర్షం తగ్గాక మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే బంగ్లాదేశ్‌ వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న లిటన్‌ దాస్‌ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ 74/1. 

శాంతించిన వరుణుడు.. మొదలైన మ్యాచ్‌.. బంగ్లా టార్గెట్‌ 151
వరుణుడు కరుణించడంతో భారత్‌-బంగ్లా మ్యాచ్‌ తిరిగి మొదలైంది. బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ధేశించారు. అంటే బంగ్లా గెలవాలంటే మరో 54 బంతుల్లో 85 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. 

మ్యాచ్‌కు వర్షం అంతరాయం
దాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్‌ దాస్‌ 59, హొస్సేస్‌ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ 17 పరుగులు ముందంజలో ఉంది. ఇప్పటికే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్ల ఆట ముగియడంతో వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజేతను ప్రకటించనున్నారు. 

లిటన్‌ దాస్‌ విధ్వంసం.. 6 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ 60/0
185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా లిటన్‌ దాస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నాడు. 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ 60/0గా ఉంది. 

మరోసారి రెచ్చిపోయిన కోహ్లి.. టీమిండియా భారీ స్కోర్‌

భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం తర్వాత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్‌ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
వేగంగా పరుగులు సాధిద్దామన్న తొందరలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. 19వ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ (7) ఔటయ్యాడు. హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో షకీబ్‌కు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పెవిలియన్‌కు చేరాడు. 

కోహ్లి హాఫ్‌ సెంచరీ.. డీకే రనౌట్‌
సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి మరో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాతి బంతికే దినేశ్‌ కార్తీక్‌ (7) రనౌటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 150/5. విరాట్‌ కోహ్లి (50), అక్షర్‌ పటేల్‌ క్రీజ​్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
16వ ఓవర్‌లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో యాసిర్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి హార్ధిక్‌ పాండ్యా (5) ఔటయ్యాడు. 15.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 131/4. విరాట్‌ కోహ్లి (44), దినేశ్‌ కార్తీక్‌ క్రీజ​్‌లో ఉన్నారు. 

క్లీన్‌ బౌల్డ్‌ అయిన సూర్యకుమార్‌
14వ ఓవర్‌లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (30) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 13.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 116/3. విరాట్‌ కోహ్లి (31), హార్దిక్‌ పాండ్యా క్రీజ​్‌లో ఉన్నారు. 

ఫిఫ్టి కొట్టిన వెంటనే ఔటైన కేఎల్‌ రాహుల్‌
చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఆతర్వాతి బంతికే షకీబ్‌ బౌలింగ్‌లొ ముస్తాఫిజుర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 78/2. క్రీజ్‌లో కోహ్లి (23) ఉన్నాడు. 

6 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 37/1
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(13), కేఎల్‌ రాహుల్‌(21) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
టాస​ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 4వ ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2) ఔటయ్యాడు. హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో యాసిర్‌ అలీకు క్యాచ్‌ ఇచ్చి హిట్‌మ్యాన్‌ వెనుదిరిగాడు. 

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో ఇవాళ (నవంబర్‌ 2) భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. అడిలైడ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌ చేరాలంటే ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా కీలక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో (సౌతాఫ్రికా) ఆడిన దీపక్‌ హుడా స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు..

భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌: నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, లిట్టన్‌ దాస్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, అఫీఫ్‌ హోస్సేన్‌, యాసిర్‌ అలీ, మొసద్దెక్‌ హొస్సేన్‌, షొరీఫుల్‌ ఇస్లాం, నురుల్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, హసన్‌ మహమూద్‌, తిస్కన్‌ అహ్మద్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement