ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మీదే ఉంది. దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన షమీ త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అనంతరం ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధం కానున్నాడు.
ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్
ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం కసరత్తు ప్రారంభించాడు. జనవరి 22 నుండి ఇంగ్లండ్‌తో(India vs England) జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షమీ తొలుత పాల్గొంటాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న 34 ఏళ్ళ షమీ తన ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ పిచ్‌లపై తన బౌలింగ్ కసరత్తు ప్రారంభించడం గమనార్హం.
మొదట కొద్దిగా మెల్లిగా బౌలింగ్ చేసినప్పటికీ క్రమంగా తన వేగాన్నిపెంచి.. తన రిథమ్ సాధించేందుకు ప్రయత్నించాడు. షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స జరగడంతో భారత్ జట్టుకు దూరమయ్యాడు.
బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన
భారత్ జట్టు ప్రధాన బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్నునొప్పి కారణంగా ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మధ్యలో తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఎంతో అనుభవజ్ఞుడైన షమీ పునరాగమనం భారత్ జట్టుకి ఎంతో కీలకం. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాలనీ టీం మేనేజ్‌మెంట్ కోరింది.
అక్కడ అతని ఫిట్‌నెస్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే మూడో వన్డేకి బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉందని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో బుమ్రా పాల్గొంటాడని, భారత్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల వెల్లడించాడు.
అర్ష్‌దీప్ సింగ్‌కు అంతటి అనుభవం లేదు
అయితే బుమ్రా సకాలంలో కోలుకోలేని పక్షం లో షమీ పైనే భారత్ జట్టు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులో లేనందున పెద్దగా అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్ పై జట్టు నుంచి పెద్దగా ఆశించడం కష్టమే. 2015లో ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర వహించిన షమీ పాత, కొత్త బంతుల్తో నిర్దిష్టమైన లైన్ వేయడంలో మంచి దిట్ట.
కొద్దిగా అనుకూలించే పిచ్‌లపై చెలరేగిపోయే షమీని ఎదుర్కోవడం బ్యాటర్లకు ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం అద్భుత ఫామ్ తో ఉన్న బుమ్రాకి షమీ తోడైతే భారత్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా తయారవుతుందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా భారత్ స్వదేశంలో మాత్రమే కాకా విదేశాల్లో కూడా విజయాలు సాధించడంలో బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.
షమీ లేని లోటు కనిపించింది
ఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా వొంటి చేత్తో తొలి టెస్ట్ గెలిపించినా అతనికి మరో వైపు నుంచి సహకారం కొరవడింది. సిరాజ్ అడపా దడపా మెరుపులు మెరిపించినా, కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించడంలో విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా సిరాజ్ ఆశించిన రీతిలో రాణించలేదు.
ఈ కారణంగానే బుమ్రా జట్టు భారమంతా భుజానికెత్తుకుని విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే బుమ్రా చివరి టెస్ట్ మధ్యలో వెన్ను నొప్పితో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షమీ పైనే భారత్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే షమీ పూర్తిగా కోలుకున్నాడా లేదా? బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడా లేదా అన్న అంశాలపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
Comments
Please login to add a commentAdd a comment