ఆస్ట్రేలియన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు కావొస్తుంది. ఇప్పటికి వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వార్న్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. కాగా పెద్ద కూతురు సమ్మర్ ''నాన్నకు ప్రేమతో.. అంటూ రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
''ఇప్పటికే నిన్ను చాలా మిస్సవుతున్నా. చిన్నప్పుడు భయమేస్తే నిన్ను గట్టిగా హత్తుకొని నిద్రపోయేదాన్ని.. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. నీ చివరి క్షణాల్లో నేను పక్కన లేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆ సమయంలో నీ పక్కన ఉండి ఉంటే.. చేతిని పట్టుకొని ఏం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుదామనుకున్నా. అడగకుండానే అన్నీ ఇచ్చారు.. బెస్ట్ డాడీగా ఉండడం మాకు వరం.'' అని పేర్కొంది.
''చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. మీ జోకులతో మమ్మల్ని ఎన్నోసార్లు నవ్వించారు. ఈరోజు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా.. మిస్ యూ నాన్న అంటూ వార్న్ చిన్న కూతురు బ్రూక్ ట్వీట్ చేసింది.
''నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి'' అంటూ వార్న్ పెద్ద కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. ''ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’' అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనతో కుమిలిపోయారు.
ఇక గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని కోయ్ సమూహ్ ప్రాంతంలోని తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో మరణించాడు. అతని మృతిపై పలు రకాల అనుమానాలు వచ్చినప్పటికి.. వార్న్‌ది సహజ మరణమేనని థాయ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు.
చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్‌లో.. అరుదైన దృశ్యం
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment