Shane Warne's old video giving prediction to 13-year-old Rehan Ahmed - Sakshi
Sakshi News home page

'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్‌ బతికుంటే సంతోషించేవాడు

Published Sat, Jun 24 2023 12:52 PM | Last Updated on Sat, Jun 24 2023 1:20 PM

Shane Warne Old Video Resurfaces-ECB Calls-Rehan Ahmed Ashes 2nd Test - Sakshi

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. ఆసీస్‌ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్‌ 28 నుంచి లార్డ్స్‌ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్‌ టెస్టుకు మొయిన్‌ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్‌ స్పిన్నర్‌ అయిన 18 ఏళ్ల రిహాన్‌ అహ్మద్‌ను మొయిన్‌ అలీకి రీప్లేస్‌గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది.

అయితే ఇదే రిహాన్‌ అహ్మద్‌కు గతంలో ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిహాన్‌ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్‌లో బౌలింగ్‌ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించిన షేన్‌ వార్న్‌.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్‌గా బౌలింగ్‌ చేస్తున్నావ్‌. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్‌ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్‌ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు.

వార్న్‌ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్‌ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా ఇది జరగడం రిహాన్‌ అహ్మద్‌ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్‌ జట్టులో శాశ్వత స్పిన్నర్‌గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు.

ఇక రిహాన్‌ అహ్మద్‌ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్‌కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్‌ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement