దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు శార్ధూల్ ఠాకూర్(7/61 & 1/24, 0 & 24 బంతుల్లో 28)పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌తో పాటు బ్యాట్‌తోనూ రాణించిన శార్ధూల్.. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేస్తున్నాడని అభిప్రాయడ్డాడు. హార్ధిక్ నుంచి ఆశించిన దాన్ని శార్ధూల్.. నూటికి నూరు పాళ్లు నెరవేరుస్తున్నాడని ఆకాశానికెత్తాడు.
బ్యాటింగ్‌లో శార్ధూల్‌ను హార్ధిక్‌తో పోల్చలేమన్న ఆకాశ్.. బౌలింగ్‌లో మాత్రం శార్ధూల్.. ఆశించిన దాని కంటే అధికంగానే రాణిస్తున్నాడని కితాబునిచ్చాడు. శార్ధూల్.. బ్యాట్‌తోనూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం చూసామని, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తే అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. శార్ధూల్ రూపంలో టీమిండియాకు అసలుసిసలైన బౌలింగ్ ఆల్‌రౌండర్ లభించాడని కొనియాడాడు. అయితే, భారీ అంచనాలతో అతనిపై ఒత్తిడి పెంచొద్దని సూచించాడు.
ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతున్న రెండో టెస్ట్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. టీమిండియా నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వరుణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడితే తప్ప మ్యాచ్ ఫలితాన్ని ఎవరూ ఆపలేరు. మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికాకు 122 పరుగులు, టీమిండియాకు 8 వికెట్లు కావాల్సి ఉంది.
చదవండి: మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment