హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్‌లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్‌మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఎండగట్టారు.
సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్‌కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు.
జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌పైన ఉంటుంది, అలాంటిది శాంసన్‌ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్‌ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు.
జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్‌కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్‌ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్‌కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు.
Comments
Please login to add a commentAdd a comment