
సచిన్ టెండుల్కర్
OTD- Sachin Tendulkar 100 Centuries: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ-2012లో భాగంగా మార్చి 16న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సచిన్ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 114 పరుగులు సాధించాడు.
ఫలితం ఏదైనా ఈ మ్యాచ్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఇప్పటి వరకు సచిన్ సాధించిన ఈ అత్యంత అరుదైన రికార్డుకు చేరువగా రాగలిగింది టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మాత్రమే!
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇటీవలే కోహ్లి 75వ శతకం నమోదు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో తాజా సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆకాశమే హద్దు
సచిన్ టెండుల్కర్‌తో ఎన్నో మ్యాచ్‌లలో తలపడిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా కోహ్లికే ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత పరుగుల యంత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అక్తర్ పేర్కొన్నాడు.
110 సెంచరీలు చేస్తాడు
‘‘విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇప్పుడు తనపై కెప్టెన్సీ భారం లేదు. మానసికంగా ఒత్తిడి లేదు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టే వీలు కలిగింది. కోహ్లి 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది.
పరుగుల దాహంతో ఉన్న కోహ్లికి ఈ ఫీట్ అసాధ్యమేమీ కాదు’’ అని షోయబ్ అక్తర్ ఏఎన్‌ఐతో వ్యాఖ్యానించాడు. కాగా సచిన్ టెండుల్కర్.. అంతర్జాతీయ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో 46, టెస్టులో 28, టీ20లలో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వంద సెంచరీల మార్కుకు ఇంకా 25 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక 34 ఏళ్ల కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే అక్తర్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆసియా లయన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
PSL 2023: పోలార్డ్‌పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..!
Comments
Please login to add a commentAdd a comment