Photo Credit: BCCI Twitter
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నమీబియా, హాంకాంగ్‌లపై గెలుపుతో హర్మన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.
గురువారం రాత్రి హాంకాంగ్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీ చరణి 31 వికెట్లు పడగొట్టింది.

Photo Credit: BCCI Twitter
తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పూనమ్ యాదవ్ (2018లో 35 వికెట్లు), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (2024లో 30 వికెట్లు, 2022లో 29 వికెట్లు) మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించింది. 2024లో రాధా యాదవ్ 29 వికెట్లు తీసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్ ఇంకా ముగియకపోవడంతో శ్రీ చరణి అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో త్వరలోనే టాప్ స్థానానికి చేరుకునే అవకాశముంది.

Photo Credit: BCCI Twitter
👉137- మహిళల టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా హాంకాంగ్‌పై భారత జట్టుకు రెండో అతి పెద్ద విషయం. గతంలో 2018 ఆసియా కప్‌లో మలేషియా వుమెన్స్‌పై 142 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది.
👉మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 137 పరుగుల విజయం నాలుగో అతిపెద్దది. తొలి స్థానంలో పాకిస్తాన్ వుమెన్స్ 147 పరుగుల తేడాతో మలేషియా వుమెన్స్‌పై విజయం సాధించగా, రెండో స్థానంలో శ్రీలంక వుమెన్స్ (144 పరుగులు వర్సెస్ మలేషియా) కొనసాగుతుండగా, ఇండియా వుమెన్ (142 పరుగులు వర్సెస్ మలేషియా) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.


