సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. మధ్యప్రదేశ్, ముంబై జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యప్రదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్ చివరి రెండు ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
సుయాంశ్ షేడ్గే వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన పాటిదార్.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టాడు. అంతకుముందు మధ్యప్రదేశ్‌కు ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్‌లో రాయ్‌స్టన్ డయాస్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.
ఆ ఓవర్‌లో మొదటి రెండు బంతులకు రాహుల్ బాథమ్ సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే రాయ్‌స్టన్ డయాస్ బౌలింగ్‌లో బాథమ్ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఒంటరిపోరాటం చేశాడు. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు చేరుతున్నా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్ ఆతర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు.
మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment