సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు నాకౌట్ దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది.
శ్రీకర్ భరత్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా.. అశ్విన్ హెబ్బర్ (52), రికీ భుయ్ (68) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై.. అజింక్య రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రహానే 5 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (34), శ్రేయస్ అయ్యర్ (25), శివమ్ దూబే (34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఆఖర్లో సుయాంశ్ షేడ్గే 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 30 పరుగులు చేసి ముంబైని విజయతీరాలు దాటించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 ఎడిషన్‌లో ఆంధ్రకు ఇది తొలి పరాజయం.
Comments
Please login to add a commentAdd a comment