Someone like Rinku Singh will miss out: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20 పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాల రాకతో భారత జట్టు మరింత పరిపుష్టమైందని.. మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశారు.
వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ వీరిద్దరిని తప్పక ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. అప్పుడే గత చేదు అనుభవాలను మరపిస్తూ ఈసారి టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఎందుకు తిరిగి రప్పించారు?
అయితే, ఒకప్పటి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను తిరిగి రప్పించడం వెనుక సెలక్టర్ల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నాడు.
గత వరల్డ్‌కప్ టోర్నీలో వైఫల్యం తర్వాత దాదాపు 14 నెలలుగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్లను మళ్లీ ఇప్పుడు ఆడిస్తే ఫలితం ఏముంటుందని ప్రశ్నించాడు.
తుదిజట్టు కూర్పు ఎలా?
‘విరాహిత్’ ద్వయం రీఎంట్రీ కారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని దీప్‌దాస్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వస్తే రింకూతో పాటు తిలక్ వర్మ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో కచ్చితంగా గందరగోళం నెలకొంటుందని స్టార్ స్పోర్ట్స్ షోలో దీప్‌దాస్ గుప్తా వ్యాఖ్యానించాడు.
కోహ్లి, రోహిత్ రీఎంట్రీ అవసరమా?
‘‘టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పక్కనపెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని అనుకున్నాను. కానీ సెలక్టర్ల నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. టీ20 వరల్డ్‌కప్-2022లో సీనియర్ ప్లేయర్లు ఉన్నా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయాం కదా!
కానీ మళ్లీ మరోసారి అదే పునరావృతం చేస్తున్నారు. వెస్టిండీస్ పిచ్‌ల మీద 160, 180, 200 పరుగుల స్కోరు ఆశిస్తున్నారా? గతేడాదితో పోలిస్తే ఇప్పటి జట్టును చూస్తుంటే టీమిండియా మళ్లీ తిరోగమిస్తోందనిపిస్తోంది. రోహిత్, కోహ్లిలను మళ్లీ తీసుకురావడంలో ఇంతకంటే గొప్ప అర్థమేముంది?
రింకూలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి?
ఇలాంటి నిర్ణయాల వల్ల రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు జట్టులో చోటే కష్టమవుతుంది. కేవలం అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ గురించి కాకుండా వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని సమాలోచనలు చేయాలి. ప్రస్తుతం రింకూ, యశస్వి తమను తాము నిరూపించుకుని పెద్ద మ్యాచ్‌లలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం రోహిత్, కోహ్లి, పాండ్యా, సూర్యలతో నిండిపోతే రింకూ, తిలక్ వర్మ లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి?’’ అని దీప్‌దాస్ గుప్తా ఈ సందర్భంగా ప్రశ్నలు లేవనెత్తాడు. కాగా బెంగాల్‌కు చెందిన దీప్‌దాస్ టీమిండియా తరఫున 8 టెస్టుల్లో 344, 5 వన్డేల్లో 51 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లి- రోహిత్ రీఎంట్రీకి సిద్ధమయ్యారు.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment