ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేతనైనంత సాయం చేస్తూ, గొప్ప మానవతా వాదిగా అందరిచే కీర్తింపబడుతున్న సోనూ సూద్.. టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సోనూ సూద్.. తన పేరుపై స్వచ్చంద సంస్థను నెలకొల్పి సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. కాగా, తాను నెలకొల్పిన ఫౌండేషన్‌కు టీమిండియా ఆటగాడు కర్ణ్ శర్మ నిర్విరామంగా సేవలందిస్తున్న విషయాన్ని సోనూ సూద్ గుర్తించాడు. దీంతో మంగళవారం ట్విటర్ వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
Thank you so much brother @sharmakarn03 for your constant support to @SoodFoundation! You have inspired the youth of the nation once again and people like you truly make this world a beautiful and peaceful place. 🤗
— sonu sood (@SonuSood) May 18, 2021
సోనూ సూద్ ఫౌండేషన్‌కు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దేశంలోనే ఎంతో మంది యువకులకు నీవు స్పూర్తిగా నిలిచావు బ్రదర్, నీలాంటి గొప్ప వ్యక్తులే ఈ ప్రపంచాన్ని అందంగా, ప్రశాంతంగా మార్చగలరు అంటూ కొనియాడారు. ఇదిలా ఉంటే సోనూ సూద్ చేసిన ట్వీట్‌పై కర్ణ్ శర్మ కూడా స్పందించాడు. ఈ దేశానికి రియల్ హీరో మీరే భాయ్, ఆపదలో ఉన్న ప్రజలకు మీరందిస్తున్న సేవలకు హ్యాట్సాఫ్, మీ సేవలను ఇలానే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానంటూ రీట్వీట్ చేశాడు. సోనూ ఫౌండేషన్‌కు కర్ణ్ శర్మ చేసిన సాయం ఏంటనే విషయాన్ని ఇద్దరూ వెల్లడించకపోవడం విశేషం.
కాగా, కర్ణ్ శర్మ భారత్ తరఫున ఓ టెస్టు, రెండు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. 2020 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కర్ణ్ శర్మ.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆ జట్టు వదులుకుంది. దీంతో 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగులు చేయలేదు. ఐపీఎల్‌లో మొత్తం 68 మ్యాచ్‌లు ఆడిన శర్మ 59 వికెట్లు తీశాడు. కర్ణ్ శర్మకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లక్కీ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017 ముంబై ఇండియన్స్, 2018 సీఎస్‌కే జట్లు టైటిల్‌లు సాధించినప్పుడు అతను ఆయా జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. దీంతో అతను లక్కీ స్టార్‌గా గుర్తింపు పొందాడు.
చదవండి: ఆ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment