సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టీమిండియా అత్యంత విజయంవతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఈ బెంగాల్ టైగర్.. ఇండియన్ క్రికెట్ దిశదశను మార్చేశాడు.
అప్పటివరకు విజయాలపై సచిన్‌పై ఆధారపడ్డ భారత్‌కు.. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లను పరిచయం చేశాడు. యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు అతడి సారథ్యంలోనే వెలుగులోకి వచ్చినవారే. అయితే అద్భుతమైన ఆటగాడిగా, నాయకుడిగా నిలిచిన గంగూలీకి.. వరల్డ్‌కప్ టైటిల్ ఒక్కటే అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచిన బెంగాల్ దాదా... 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చవిచూశాడు. అయితే కెప్టెన్‌గా గంగూలీ సాధించిన విజయాలు ప్రపంచకప్‌లతో సమానం. అతడు భారత్‌కు అందించిన చారిత్రత్మక విజయాల్లో 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ ఒకటి.
ఇంగ్లండ్‌పై సిరీస్ విజయనంతరం గంగూలీ ప్రతిష్టాత్మక లార్డ్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి చేసుకున్న సంబరాలను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అంతలా దాదా సెలబ్రేషన్స్ జరపుకోవడం వెనక ఓ కథ దాగి ఉంది.
ఇంగ్లండ్-భారత్ ఫైనల్ పోరు..
2002 ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు నాట్‌వెస్ట్ ట్రై సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు శ్రీలంక, భారత జట్లు భాగమయ్యాయి. శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఇంటిముఖం పట్టగా.. టీమిండియా, ఇంగ్లండ్ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాయి. అయితే ఈ సిరీస్ మొత్తం ఒక లెక్క.. ఫైనల్ మ్యాచ్ ఒక లెక్క.
2002 జూలై 13.. క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరులో ఇంగ్లండ్-భారత జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ ట్రెస్కోథిక్(109), నాజర్ హుస్సేన్(119) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్ల జహీర్ ఖాన్(మూడు వికెట్లు) మినహా మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు.
యువీ, కైఫ్ అద్భుత పోరాటం..
326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (45; 49 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే వీరిద్దరి ఔటయ్యాక అస్సలు కథ మొదలైంది. వెంటవెంటనే దినేశ్ మోంగియా (9), సచిన్ (14), ద్రవిడ్ (5) వికెట్లను భారత్ కోల్పోయింది. 146/5 తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
దీంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అదే సమయంలో క్రీజులో ఉన్న యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతం చేశారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను తమ విరోచిత పోరాటంతో వారిద్దరూ గెలుపు బాట పట్టించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు.
యువరాజ్ సింగ్ (69, 63 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్; 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరి అద్బుత పోరాటం ఫలితంగా భారత్ మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టగానే లార్డ్స్ మైదానం భారత అభిమానుల చప్పట్ల హోరుతో దద్దరిల్లిపోయింది.
గంగూలీ స్వీట్ రివెంజ్..
అభిమానులతో పాటు భారత జట్టు మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఈ క్రమంలో లార్డ్స్ బాల్కనీలో ఉన్న టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి గిరా గిరా తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణంలో దాదా ఆనందానికి అవధులు లేవు. అయితే గంగూలీ అంతగా రియాక్ట్ అవ్వడం వెనక ఓ కారణం దాగి ఉంది. అదే ఏడాది ముంబై వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన ఆరో వన్డే మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది.
ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. ఆండ్రూ ఫ్లింటాప్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన వెంటనే ఫ్లింటాప్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఇది మన బెంగాల్ టైగర్‌ను నచ్చలేదు. ఆ రోజే సౌరవ్ ఫిక్స్ అయ్యాడు.. ఈ ఇంగ్లీష్ జట్టుకు వాళ్ల సొంతగడ్డపైనే అదిరిపోయే సమాధానం చెప్పాలని. తను అనుకున్న విధంగానే ఇంగ్లండ్‌ను ప్రతిష్టాత్మక లార్డ్ మైదానంలో ఓడించి.. తన స్వీట్ రివెంజ్‌ను తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని గంగూలీనే చాలా సార్లు స్వయంగా వెల్లడించాడు.
వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే..
అయితే ఆ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని గంగూలీని ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశ్నించాడు. . 'లార్డ్స్ అంటే ప్రపంచ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్‌కాట్ అడగ్గా.. వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని గంగూలీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment