
ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి ఆధిపత్యం సాధించింది. కానీ దురదృష్టవశాత్తూ పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 357 పరుగులు చేయగా.. ఆతిథ్య విండీస్ 233 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టబ్స్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
దీంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కరేబియన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథానాజ్(92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 15 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment