
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు... ‘‘అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి నేను రిటైర్ అవుతున్నాను. నా ప్రయాణంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటాన్‌కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్‌గా పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్ మోరిస్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా జట్టు అతడిని 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు మోరిస్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.
కాగా 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు క్రిస్ మోరిస్. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2019లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే 81 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ మోరిస్ 618 పరుగులు చేశాడు. 95 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో రాజస్తాన్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు చేయడంతో పాటుగా... 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.