బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది.
చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి.
ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు.
ఫైనల్లో వెస్ట్‌జోన్...
సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్‌జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment