Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు.
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి
వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్‌వల్లా బౌలింగ్‌లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
వెలుతురు లేమి కారణంగా
వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు.
వాషింగ్టన్ సుందర్(9), విజయ్‌కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్‌వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు.
విహారి 46వ ఫిఫ్టీ
వెస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్‌లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి!
Comments
Please login to add a commentAdd a comment