ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.
ఆ పరాభవాన్ని మోసుకురాలేదు
ఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.
అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.
విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు
‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్‌లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.
ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుంది
గతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!
న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
తుదిజట్టు ఖరారైంది.. కానీ
ఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.
చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment