స్పిన్ దిగ్గజం, శ్రీలంకన్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ముత్తయ్య మురళీథరన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో (బడనగుప్పే అనే ప్రాంతంలో) 1400 కోట్ల పెట్టుబడితో బెవరేజ్ యూనిట్ (శీతల పానీయాల తయారీ కేంద్రం) స్థాపించనున్నాడు. ఇందు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కర్ణాటక ప్రభుత్వం మురళీ స్థాపించబోయే ‘ముత్తయ్య బెవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్' సంస్థకు బడనగుప్పేలో 46 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మురళీ, కర్ణాటక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ దృవీకరించారు. మురళీ శీతల పానీయాల యూనిట్ వచ్చే ఏడాది జనవరి నుంచి పనులను ప్రారంభించాలని భావిస్తుంది.
మురళీ ఈ శీతల పానీయాల వ్యాపారాన్ని శ్రీలంకలో విజయవంతంగా నడుపుతున్నాడు. తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించడంలో భాగంగా అతను తొలుత కర్ణాటకలో పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటక పరిశ్రమల మంత్రి చెప్పిన ప్రకారం మురళీ త్వరలో తన వ్యాపారాన్ని ధార్వడ్ జిల్లాకు కూడా విస్తరించనున్నాడు.
కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మురళీ ఇటీవల ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ను కలిశారు. ఆ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ గుంజన్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 52 ఏళ్ల మురళీథరన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్ట్రాటజిక్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment