Sunil Gavaskar Feels World Cup 2023 Schedule Will Benefit India - Sakshi
Sakshi News home page

ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్

Published Mon, Jul 3 2023 5:43 PM | Last Updated on Tue, Oct 3 2023 6:12 PM

Sunil Gavaskar Feels World Cup 2023 Schedule Will Benefit India - Sakshi

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ విడుదల చేసింది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక దాదాపు పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ జరగనుండడంతో.. 2011 ప్రపంచకప్‌ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని భారత జట్టు భావిస్తోంది.

కాగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సారధ్యంలోని టీమిండియా ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్‌ సొంతం చేసుకోలేకపోయింది. చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిపోయింది.

ఈ క్రమంలో ఎలాగైనా ఐసీసీ టైటిల్‌ను సాధించి తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఇక ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో భారత్‌ ఆడనుంది.

ఇక క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ ఆక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆరంభంలోనే ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ వంటి బలమైన జట్లతో ఆడనుండడం భారత జట్టుకు కలిసిస్తోందని  గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

"తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కొవడం భారత జట్టుకు కలిసిస్తోంది. అదే ఆఖరిలో డూ ఆర్‌డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వంటి జట్టుతో ఆడాల్సి వస్తే.. టీమిండియాపై ఒత్తడి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బలమైన జట్లను ముందుగా ఎదుర్కొంటే ఆయా టీమ్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఆస్ట్రేలియాపై మనం ఓటమి చెందితే.. మిగిలిన టీమ్స్‌తో ఎలా ఆడాలో ఒక క్లారిటీ వస్తుంది. అ తర్వాత టోర్నీలో ముందుకు సాగేందుకు మనం ప్రణాళికలు, వ్యూహాలు సిద్దం చేసుకోవచ్చు.

మేము 1983 ప్రపంచకప్‌లో కూడా పటిష్ట వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడాము. విండీస్‌ డిఫెండింగ్ ఛాంపియన్స్‌ అయినప్పటికీ మేము ఆ మ్యాచ్‌లో ఓడించాము. ఆ సమయంలో మా ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయింది. మేము ఏకంగా ఛాంపియన్స్‌గా నిలిచాం. అదే విధంగా ప్రస్తుత భారత జట్టు కూడా ఆసీస్‌, పాకిస్తాన్‌ వంటి మేటి జట్లపై విజయం సాధిస్తే హిస్టరీ రిపీట్‌ చేసే అవకాశం ఉంది అని స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: 'చహల్‌ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement