CPL 2023: క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!   | Sunil Narine Became The First Player In CPL History To Receive A Red Card | Sakshi
Sakshi News home page

CPL 2023: క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!  

Published Mon, Aug 28 2023 7:40 PM | Last Updated on Mon, Aug 28 2023 7:44 PM

Sunil Narine Became The First Player In CPL History To Receive A Red Card - Sakshi

క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌ జారీ చేయబడింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌కు అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్‌ కార్డ్‌ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ చరిత్రపుటల్లోకెక్కాడు. 

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో, అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్‌ నరైన్‌ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ ప్రతిపాదించగా.. ఫీల్డ్‌ అంపైర్‌ నరైన్‌కు రెడ్‌ కార్డ్‌ చూపించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్‌లో ఈ రెడ్‌ కార్డ్‌ రూల్‌ అమల్లోకి వచ్చింది. 

ఫుట్‌బాల్‌లో ఈ రెడ్‌ కార్డ్‌ విధానాన్ని మనం తరుచూ చూస్తుంటాం. అయితే క్రికెట్‌లో మాత్రం ఇదే తొలిసారి. ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడు కఠినమైన ఫౌల్‌కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్‌ కార్డ్‌ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్‌లో ఫుట్‌బాల్‌లోలా కాకుండా స్లో ఓవర్‌ రేట్‌కు పెనాల్టీగా ఈ రెడ్‌ కార్డ్‌ను ఇష్యూ చేస్తారు.

ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే, రెడ్‌ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్‌), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్‌) 20 యార్డ్స్‌ సర్కిల్‌లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌  17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్‌ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్‌ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్‌ కొనసాగించింది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌.. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (38 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు.

179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్‌ పూరన్‌ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్‌ పోలార్డ్‌ (16 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (8 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్‌ 17.1 ఓవర్లలో కేవలం​ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో బోష్‌ 3, ముజరబానీ ఓ వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement