నితీశ్‌ ‘షో’ | Sunrisers Hyderabad win by 2 runs vs Punjab Kings | Sakshi
Sakshi News home page

నితీశ్‌ ‘షో’

Published Wed, Apr 10 2024 3:26 AM | Last Updated on Wed, Apr 10 2024 9:48 AM

Sunrisers Hyderabad win by 2 runs vs Punjab Kings - Sakshi

వైజాగ్‌ కుర్రాడి మెరుపు ప్రదర్శన   

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ గెలుపు 

2 పరుగులతో ఓడిన పంజాబ్‌  

ముల్లన్‌పూర్‌: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్‌ గడ్డపై ఆంధ్ర బ్యాటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. ముందుగా సన్‌రైజర్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్‌తో పాటు అబ్దుల్‌ సమద్‌ (12 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అర్షదీప్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది.

శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, అశుతోష్‌ (15 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్‌ ఉనాద్కట్‌ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు వేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్‌ 3 సిక్స్‌లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్‌ ఊపిరి పీల్చుకుంది.  

నితీశ్‌ వీరబాదుడు... 
ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (0)లను ఒకే ఓవర్లో అర్షదీప్ అవుట్‌ చేయగా, అభిషేక్‌ శర్మ (16)కు సామ్‌ కరన్‌ కళ్లెం వేశాడు. 39 పరుగులకే టాప్‌ 3 వికెట్లను కోల్పోయింది. రాహుల్‌ త్రిపాఠి (11) ‘ఇంపాక్ట్‌’ చూపలేకపోయాడు. సగం (10) ఓవర్లు ముగిసే సరికి జట్టు 66/4 స్కోరు చేసింది. అయితే నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచి్చన నితీశ్‌ పదో ఓవర్‌దాకా చేసిన స్కోరు 14! ఒకటే బౌండరీ కొట్టాడు.

ఇలా ఆడిన విశాఖ కుర్రాడు ధనాధన్‌కు స్విచ్చాన్‌ చేసినట్లుగా 11వ ఓవర్‌ నుంచి అనూహ్యంగా దంచేశాడు. హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో 4, 6 బాదగా, క్లాసెన్‌ ఓ ఫోర్‌ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబడ, సామ్‌ కరన్‌ ఓవర్లలో చెరో సిక్సర్‌తో దూకుడు పెంచాడు. క్లాసెన్‌ (9) అవుటయ్యాక సమద్‌ రావడంతో దూకుడు ‘డబుల్‌’ అయింది. హర్‌ప్రీత్‌ 15వ ఓవర్‌నూ పూర్తిగా ఎదుర్కొన్న నితీశ్‌ 0, 4, 6, 4, 6, 2లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. 17వ ఓవర్‌ వేసిన అర్షదీప్ 3 బంతుల వ్యవధిలో సమద్, నితీశ్‌లను అవుట్‌ చేయడంతో రైజర్స్‌ డెత్‌ ఓవర్లలో ఆశించినన్ని పరుగుల్ని చేయలేకపోయింది. 

దెబ్బకొట్టిన భువీ... 
 ఓపెనర్‌ బెయిర్‌స్టో (0)ను రెండో ఓవర్లోనే కమిన్స్‌ డకౌట్‌ చేయగా, భువనేశ్వర్‌ వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్‌ (4)తో పాటు మరో శిఖర్‌ ధావన్‌ (14)ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాపార్డర్‌ కూలింది. సామ్‌ కరన్‌ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సికందర్‌ రజా (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు పోరాడారు. నటరాజన్‌ పదో ఓవర్లో సామ్‌ కరన్‌ బౌండరీ కోసం ప్రయత్నించగా మిడాఫ్‌లో కమిన్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతని ఆట ముగించాడు. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద రజా ని్రష్కమించడంతో సన్‌రైజర్స్‌ గెలుపు దాదాపుగా ఖాయమైంది.

అయితే ఆఖరి ఓవర్లో ఉనాద్కట్‌ 3 వైడ్లు వేయడంతో 2 బంతుల్లో 10 పరుగుల సమీకరణం పంజాబ్‌కు అవకాశమిచ్చింది. అశుతోష్‌ మరో షాట్‌ ఆడగా డీప్‌ మిడ్‌ వికెట్‌ వద్ద రాహుల్‌ త్రిపాఠి క్యాచ్‌ జారవిడిచాడు. ఒకే పరుగు రావడంతో ఇక ఆఖరి బంతికి 9 పరుగులు అసాధ్యమవడంతో హైదరాబాద్‌ గెలిచింది. అయితే చివరి బంతిని శశాంక్‌ సిక్స్‌ కొట్టడంతో సన్‌రైజర్స్‌ 2 పరుగులతో నెగ్గింది. 

సన్‌రైజర్స్‌ జట్టులో విజయకాంత్‌ 
శ్రీలంక యువ లెగ్‌స్పిన్నర్‌ విజయకాంత్‌ వియస్కాత్‌ ఐపీఎల్‌ టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన లంక లెగ్‌స్పిన్నర్‌ వనిందు హసరంగ స్థానంలో కనీస విలువ రూ. 50 లక్షలకు రైజర్స్‌ యాజమాన్యం విజయ్‌కాంత్‌ను ఎంచుకుంది. 22 ఏళ్ల విజయ్‌కాంత్‌ ఆసియా క్రీడల్లో లంక తరఫున ఒకే ఒక అంతర్జాతీయ టి20 ఆడాడు. 

స్కోరు వివరాలు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) ధావన్‌ (బి) అర్షదీప్ 21; అభిషేక్‌ (సి) శశాంక్‌ (బి) సామ్‌ కరన్‌ 16; మార్క్‌రమ్‌ (సి) జితేశ్‌ (బి) అర్షదీప్ 0; నితీశ్‌ కుమార్‌ (సి) రబడ (బి) అర్షదీప్ 64; రాహుల్‌ త్రిపాఠి (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 11; క్లాసెన్‌ (సి) సామ్‌ కరన్‌ (బి) హర్షల్‌ 9; సమద్‌ (సి) హర్షల్‌ (బి) అర్షదీప్ 25; షాబాజ్‌ నాటౌట్‌ 14; కమిన్స్‌ (బి) రబడ 3; భువనేశ్వర్‌ (సి) బెయిర్‌స్టో (బి) సామ్‌ కరన్‌ 6; ఉనాద్కట్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–39, 4–64, 5–100, 6–150, 7–151, 8–155, 9–176.

బౌలింగ్‌: రబడ 4–0–32–1, అర్షదీప్ 4–0–29–4, సామ్‌ కరన్‌ 4–0–41–2, హర్షల్‌ 4–0–30–2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–48–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) భువనేశ్వర్‌ 14; బెయిర్‌స్టో (బి) కమిన్స్‌ 0; ప్రభ్‌సిమ్రాన్‌ (సి) నితీశ్‌ (బి) భువనేశ్వర్‌ 4; సామ్‌ కరన్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 29; సికందర్‌ రజా (సి) క్లాసెన్‌ (బి) ఉనాద్కట్‌ 28; శశాంక్‌ నాటౌట్‌ 46; జితేశ్‌ (సి) అభిషేక్‌ (బి) నితీశ్‌ 19; అశుతోష్‌ నాటౌట్‌ 33; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–2, 2–11, 3–20, 4–58, 5–91, 6–114. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–1–32–2, కమిన్స్‌ 4–0–22–1, నటరాజన్‌ 4–0–33–1, నితీశ్‌ కుమార్‌ 3–0–33–1, ఉనాద్కట్‌ 4–0–49–1, షహబాజ్‌ 1–0–10–0.  

అదరగొట్టాడు
ఏడేళ్ల క్రితం...బీసీసీఐ అండర్‌–16 టోర్నీ విజయ్‌మర్చంట్‌ ట్రోఫీ..రాజ్‌కోట్‌లో నాగాలాండ్‌తో ఆంధ్ర మ్యాచ్‌. అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి 345 బంతుల్లో ఏకంగా 441 పరుగుల స్కోరు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్వాడ్రపుల్‌ సెంచరీ మాత్రమే కాకుండా టోర్నీ మొత్తం అదరగొట్టిన అతను 8 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 176.71 సగటుతో ఏకంగా 1237 పరుగులు నమోదు చేశాడు. విజయ్‌మర్చంట్‌ ట్రోఫీ చరిత్రలో ఒక్క సీజన్‌లో ఎవరూ చేయని పరుగుల రికార్డు అది. ఆ ఏడాది బీసీసీఐ వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్‌ అండర్‌–16 క్రికెటర్‌’గా నిలవడంతో దేశవాళీ క్రికెట్‌లో అందరి దృష్టీ ఈ కుర్రాడిపై పడింది.

ఓపెనర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నితీశ్‌ అండర్‌–19 స్థాయి వినూ మన్కడ్‌ ట్రోఫీ, చాలెంజర్‌ టోర్నీ వరకు అలాగే కొనసాగించాడు. అయితే మరో వైపు మీడియం పేస్‌ బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టిన అతను కొత్త బంతితో బౌలింగ్‌ చేశాడు. దాంతో భారం ఎక్కువ కావడంతో అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మిడిలార్డర్‌లోకి మార్చారు. వైజాగ్‌లో పుట్టిన నితీశ్‌ ఏజ్‌ గ్రూప్‌ టోర్నీల్లో సత్తా చాటిన తర్వాత 2020–21 సీజన్‌లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకంగా మారాడు. రెండేళ్ల తర్వాత రంజీ సీజన్‌లో 25 వికెట్లు పడగొట్టిన నితీశ్‌ తన బౌలింగ్‌ పదును కూడా చూపించాడు.

తాజా సీజన్‌ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నితీశ్‌ బాధిత బ్యాటర్లలో పుజారా, రహానే, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. బ్యాటింగ్‌లో చెలరేగుతూ మీడియం పేస్‌ బౌలింగ్‌ చేసే హార్దిక్‌ పాండ్యాను అతను అభిమానిస్తాడు. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్‌ జింక్‌ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే రాజస్తాన్‌కు బదిలీ కావడంతో ఆయన ఉద్యోగంకంటే కొడుకు భవిష్యత్తే ముఖ్యమని భావిస్తూ రాజీనామా చేశారు.

ఆ తర్వాత పూర్తిస్థాయిలో నితీశ్‌కు మార్గనిర్దేశం చేసి నడిపించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో నితీశ్‌ అందరికీ తెలిశాడు. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున 2 మ్యాచ్‌లు ఆడినా బ్యాటింగ్‌ రాకపోగా, వికెట్‌ కూడా దక్కలేదు. ఈ సీజన్‌లో చెన్నైతో మ్యాచ్‌లో 8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 పరుగులు చేసి ట్రైలర్‌ చూపించిన నితీశ్‌ తానేంటే ఈ మ్యాచ్‌లో అసలు షో ప్రదర్శించాడు. చాలా కాలం తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఒక స్థానిక ఆటగాడు చెలరేగి జట్టును గెలిపించడం మరో విశేషం. - (సాక్షి క్రీడా విభాగం)  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement