లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్‌సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్‌సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్‌సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్‌మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్‌సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్‌సెట్‌కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్‌సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది.
కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment