టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్టు జట్టులోనూ పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశీ రెడ్‌బాల్ టోర్నమెంట్ ఆడేందుకు ఈ ముంబై బ్యాటర్ సిద్ధమయ్యాడు. రానున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా సూర్య వైట్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ధారించింది. ఇక తన నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడబోతున్నాను. తద్వారా.. దేశవాళీ సీజన్(రంజీ) మొదలయ్యే ముందు నాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. ఈనెల 25 తర్వాత జట్టుతో చేరతా. నాకు వీలున్నపుడల్లా కచ్చితంగా ముంబై జట్టుకు, క్లబ్ టీమ్‌కు తప్పక ఆడతా’’ అని స్పష్టం చేశాడు.
ఇక సూర్య ఈ టోర్నీలో ఆడటంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సూర్య ముందే చెప్పాడు. అతడు అందరిలాంటి వాడు కాదు. క్లబ్ మ్యాచ్‌లు ఆడతానన్నాడు. కెప్టెన్‌గా ఉంటారా అని మేము తనని అడిగాం. అయితే, సూర్య మాత్రం సర్ఫరాజ్‌నే సారథిగా కొనసాగించమని చెప్పాడు. తను ఆటగాడిగా ఉంటానని చెప్పాడు’’ అని ముంబై వర్గాలు తెలిపాయి.
కాగా టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలిసారి శ్రీలంకలో పర్యటించిన సూర్యకుమార్ యాదవ్.. 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే, టెస్టుల్లో సూర్య రికార్డు అంతగొప్పగా ఏం లేదు. టీమిండియా తరఫున ఇంతవరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ముంబై జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అజింక్య రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సర్ఫరాజ్‌కు ఈ సువర్ణావకాశం వచ్చింది. తొలిసారి జట్టుకు నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు. అయితే, సూర్య రాకతో సర్ఫరాజ్ పదవి చేజారుతుందని భావించగా.. సూర్య మాత్రం అతడినే కొనసాగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో 1868లో జన్మించారు ఆయన. క్రికెట్ క్లబ్‌లో స్వదేశీయులకు అవకాశాలు కల్పించారు. ఆయన జ్ఞాపకార్థం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. దేశీ రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. ఆగష్టు 15న టోర్నీ మొదలుకానుంది.
బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు తొలుత ముంబై ప్రకటించిన జట్టు
సర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా.
Comments
Please login to add a commentAdd a comment