టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్ ఖరారైంది. ఇవాళ (నవంబర్ 6) ఉదయం సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతో 6 పాయింట్లు కలిగిన టీమిండియా.. జింబాబ్వే మ్యాచ్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో సెమీస్ బెర్త్ ఉదయం 9:30 గంటలకు జరిగే పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలుపుతో పాక్ ఆశల పల్లకీలో ఊరేగుతుండగా.. మరో పక్క అనూహ్యంగా సెమీస్ రేసులోకి వచ్చిన బంగ్లాదేశ్ సైతం సంబురాల్లో మునిగి తేలుతుంది. పాక్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచిందా.. రన్‌రేట్‌తొ సంబంధం లేకుండా టీమిండియాతో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. అదే పాక్ గెలిచినా రోహిత్ సేనతో సెమీస్ బరిలో నిలుస్తుంది. ప్రస్తుత సమీకరణలతో సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయో కూడా దాదాపుగా ఖరారైంది. టీమిండియా జింబాబ్వేపై గెలిస్తే.. ఇంగ్లండ్‌తో.. పాక్, బంగ్లాలలో ఏదో ఒక జట్టు న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడుతుంది.
ఇదిలా ఉంటే, సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్‌మన్ (41 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడ్డ సౌతాఫ్రికా.. అనూహ్యంగా నెదర్లాండ్స్ బౌలర్ల ఉచ్చులో చిక్కుకుని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. డచ్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్ 3, బాస్ డి లీడ్, ఫ్రెడ్ క్లాస్సెన్ తలో 2 వికెట్లు, పాల్ వాన్ మీకెరెన్ ఓ వికెట్ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమై 13 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీ బ్యాటర్లలో రిలీ రొస్సో (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment