టీమిండియాతో టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ (ఫైల్ ఫొటో)
T20 World Cup 2022- Final Prediction: ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌ను రెండుసార్లు ముద్దాడిన ఏకైక జట్టు వెస్టిండీస్. 2012, 2016లో ట్రోఫీని కైవసం చేసుకున్న విండీస్.. గతేడాది మాత్రం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి.
ఇటీవలి కాలంలో కూడా పూరన్ బృందం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా సహా పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియా తదితర జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆసీస్‌తో ఫైనల్లో..
పొట్టి ఫార్మాట్‌లో విండీస్ కష్టాలు ఇలా ఉంటే అతడు మాత్రం తమ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని జోస్యం చెప్పాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తుదిపోరులో పోటీ పడుతుందంటూ గేల్ వ్యాఖ్యానించాడు.
ఈ మేరకు దైనిక్ జాగరణ్‌తో ముచ్చటించిన యూనివర్సల్ బాస్.. ‘‘ఈసారి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య ఫైనల్ జరుగుతుందనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని.. తమదైన రోజున చెలరేగి ఆడతారని చెప్పుకొచ్చాడు.
అయితే, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటు అన్న ఈ వెటరన్ ఓపెనర్.. ఫైనల్‌కు మాత్రం తమ జట్టు అర్హత సాధించే అవకాశం ఉందన్నాడు. కాగా క్రిస్ గేల్ ఇప్పటి వరకు ఆరు టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ జరుగనుంది. ఇందుకోసం పూరన్ బృందం ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకుంది.
ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా టీమిండియా ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు కూడా గట్టి పోటీనిచ్చేందుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్‌గేల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్-2022 వెస్టిండీస్ జట్టు:
నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, యానిక్ కరియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ స్మిత్, షమార్ బ్రూక్స్.
చదవండి: నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్
Comments
Please login to add a commentAdd a comment