T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి! | T20 WC 2024: Jake Fraser McGurk Matt Short Last Minute Entry in Australia Squad | Sakshi
Sakshi News home page

T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి మొండిచేయి

Published Tue, May 21 2024 12:11 PM | Last Updated on Tue, May 21 2024 12:32 PM

T20 WC 2024: Jake Fraser McGurk Matt Short Last Minute Entry in Australia Squad

క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక ప్రకటన (PC: CA)

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్‌-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్‌ వరల్డ్‌కప్‌ జట్టుతో ప్రయాణించనున్నాడు.

కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.

అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్‌ ఫ్రేజర్‌- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.

స్టీవ్‌ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయి
ఈ క్రమంలో సీనియర్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు జేసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్‌ 5న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. బార్బడోస్‌ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.

దుమ్ములేపిన మెగర్క్‌
ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.

ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్‌.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.

అందుకే ఇలా జరిగింది
ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో జేక్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్‌ జట్టు ఫైనల్‌ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.

ఇక మాథ్యూ షార్ట్‌ సైతం బిగ్‌బాష్‌ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్‌ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్‌ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2024కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌, మాథ్యూ షార్ట్‌.

చదవండి: శివ‌మ్ దూబేపై వేటు.. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఫినిష‌ర్‌కు చోటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement