బాబర్ ఆజం (PC: PCB)
NZ- Ban- Pak Tri Series- T20 World Cup 2022- India Vs Pakistan: క్రికెట్ ప్రేమికుల హాట్ ఫేవరెట్ మ్యాచ్‌లలో అన్నింటి కంటే ముందు వరుసలో ఉండేది ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండటంతో దాయాదుల పోరుపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రెండు సార్లు తలపడిన రోహిత్ సేన- బాబర్ ఆజం బృందం.. టీ20 వరల్డ్‌కప్-2022లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. అక్టోబరు 23న టీమిండియా- పాక్ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఈ మెగా పోరుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహా ఇతర ఆటగాళ్లు.. మైండ్‌గేమ్ మొదలుపెట్టారు.
టీమిండియాతో మ్యాచ్ కోసం ఇలా..
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్ ఆడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా భాగమైన ఈ సిరీస్‌లో కివీస్- పాక్ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్-2022 కోసం ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలోనే తాము ఈ సిరీస్‌లో పాల్గొన్నట్లు వెల్లడించాడు.
‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. అయితే, ఇలాంటి మ్యాచ్‌లో ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మెరుగ్గా ఆడగలం. ఇండియాతో మ్యాచ్‌లో కచ్చితంగా పూర్తిస్థాయిలో.. వందకు వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం’’ అని తమ ప్రణాళిక గురించి చెప్పాడు.
ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహం
అదే విధంగా న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్‌లో ఆడటం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని.. ఈ సిరీస్ ద్వారా మెగా టోర్నీకి ముందు తమకు మంచి అవకాశం దొరికింది అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం (అక్టోబరు 14) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ‘కోహ్లి సేన’ పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.
చదవండి: Babar Azam: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్
T20 WC 2022: మెగా టోర్నీలో అరుదైన ఘనతల ముంగిట రోహిత్ శర్మ! అదే జరిగితే రికార్డులన్నీ బద్దలే!
Comments
Please login to add a commentAdd a comment