నా ఫేవరెట్‌ క్రికెటర్‌ కోహ్లి.. ఎందుకంటే: కెనడా కెప్టెన్‌ | T20 World Cup 2024: Virat Kohli Is My Favourite: Canada Pakistan Born Captain Says | Sakshi
Sakshi News home page

నా ఫేవరెట్‌ క్రికెటర్‌ కోహ్లి.. ఎందుకంటే: కెనడా కెప్టెన్‌

Published Sat, Jun 15 2024 3:22 PM

T20 WC Virat Kohli Is My Favourite For: Canada Pakistan Born Captain Says

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆటంటే తనకెంతో ఇష్టమని కెనడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జఫర్‌ అన్నాడు. తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రికెటర్‌ అతడే అని తెలిపాడు.

కోహ్లి సేవలు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన గొప్ప ఆటగాడని సాద్‌ బిన్‌ జఫర్‌ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్‌, అమెరికా, ఐర్లాండ్‌లతో పాటు కెనడా గ్రూప్‌-ఏలో ఉంది.

ఈ గ్రూపు నుంచి ఇప్పటికే భారత్‌, అమెరికా సూపర్‌-8కు చేరగా.. పాక్‌, ఐర్లాండ్‌, కెనడా ఎలిమినేట్‌ అయ్యాయి. ఇక ఈ మెగా టోర్నీలో కెనడా ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచింది.

లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో కెనడా కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జఫర్‌ ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది
స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోహ్లి నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్‌. అతడు కేవలం టీమిండియాకే కాదు.. క్రికెట్‌ ప్రపంచానికి ఎంతో చేశాడు.

ఇక టీమిండియా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు. అలాంటి టీమ్‌తో మేము కలిసి ఒకే గ్రౌండ్‌లో ప్రత్యర్థులుగా ఆడటం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.

పాక్‌లో జన్మించిన సాద్‌ బిన్‌ జఫర్‌
ఒకవేళ ఈ మ్యాచ్‌లో మేము గనుక రాణిస్తే కచ్చితంగా క్రికెటింగ్‌ సర్క్యూట్‌లో మాకంటూ మంచి గుర్తింపు వస్తుంది’’ అని సాద్‌ బిన్‌ జఫర్‌ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన సాద్‌ బిన్‌ జఫర్‌ తర్వాత కెనడాకు మకాం మార్చాడు.

లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ అయిన జఫర్‌.. లెఫ్టాండ్‌ బ్యాటర్‌ కూడా. 37 ఏళ్ల ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ప్రస్తుతం కెనడా జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కెనడా తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, 41 టీ20 మ్యాచ్‌లు ఆడి ఆయా ఫార్మాట్లలో 16, 44 వికెట్లు తీశాడు.

ఐర్లాండ్‌పై  గెలిచి
ఇక వరల్డ్‌కప్‌-2024లో సాద్‌ బిన్‌ జఫర్‌ కెప్టెన్సీలో కెనడా తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. అనంతరం.. ఐర్లాండ్‌పై 12 పరుగుల తేడాతో గెలిచింది.

అయితే, సూపర్‌-8 రేసులో నిలవాలంటే పాకిస్తాన్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడి ఇంటిబాట పట్టనుంది.

చదవండి: పాక్‌ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement