T20 World Cup 2021: Reasons Behind Team India Failure At T20 Tournament In Telugu - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: అలసటా.. టాస్‌ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి?

Published Tue, Nov 9 2021 8:28 AM | Last Updated on Tue, Nov 9 2021 9:47 AM

T20 World Cup 2021: Reason Behind India Bad Show In Tourney Explained - Sakshi

Reason Behind India Bad Show In Tourney Explained: తొలి రెండు మ్యాచ్‌లలో రెండు పెద్ద జట్ల చేతిలో పరాజయం! ఇంకా కోలుకునేందుకు అవకాశం ఎక్కడిది? ఆ తర్వాత చిన్న టీమ్‌లపై మూడు భారీ విజయాలు సాధించినా అవి సెమీస్‌ లెక్కకు సరిపోలేదు. ఆట ముగిసిన తర్వాత ‘అలసట’ అని చెప్పినా, ‘టాస్‌’ ప్రభావం గురించి మాట్లాడినా అవన్నీ ఉత్త మాటలుగానే అనిపిస్తాయి. స్టార్లకు, రికార్డులకు కొదవ లేని జట్టు. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలు సాధించి ఊపు మీద కూడా ఉంది.

అయినా సరే విరాట్‌ బృందం మెగా టోర్నీలో చేతులెత్తేసింది. నిజానికి ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు యూఏఈలో ఆడుతున్న అనుభవం ఎంత ప్రయోజనకరమో, పిచ్‌లు మన స్పిన్‌కు ఎంతగా అనుకూలిస్తాయో ఊదరగొట్టినవారు ఇప్పుడు ఓటమి తర్వాత అదే ఐపీఎల్‌కు వరల్డ్‌ కప్‌కు మధ్య కాస్త వ్యవధి ఉంటే బాగుండేదని చెబుతున్నారు! 

అప్పుడు ఇలాగే..
నిజానికి 2016 టి20 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ ఒకదశలో దాదాపు ఇలాంటి పరిస్థితిలో నిలిచింది. అయితే అప్పుడు కోలుకునే అవకాశం లభించింది. న్యూజిలాండ్‌ చేతిలో 47 పరుగుల తేడాతో చిత్తుగా ఓడటంతో భారత్‌ టోర్నీ మొదలైంది. దాంతో ఆపై జరిగే ప్రతీ మ్యాచ్‌ ‘నాకౌట్‌’లాగానే సాగింది. ఓడితే నిష్క్రమించే పరిస్థితిలో జట్టు బరిలోకి దిగుతూ వచ్చింది.

పాక్‌పై ఏకపక్షంగా, బంగ్లాపై అనూహ్యంగా గెలిచిన జట్టు ఆసీస్‌ను అద్భుత రీతిలో ఓడించి సెమీస్‌ చేరింది. ఈసారి కాస్త మారిన ఫార్మాట్‌తో (12 జట్లు) మూడు విజయాలు ముందంజ వేసేందుకు సరిపోలేదు. 2012 టి20 ప్రపంచ కప్‌ తర్వాత ప్రతీ ఐసీసీ టోర్నీ (2013, 14, 15, 16, 17, 19)లో కనీసం సెమీస్‌ చేరిన టీమిండియా ఇప్పుడు మళ్లీ గ్రూప్‌ దశకే పరిమితమైంది. 

సమష్టి వైఫల్యమా?
భారత్‌ పేలవ ప్రదర్శనకు బ్యాటింగ్‌ వైఫల్యం కారణమా, బౌలర్లా లేక సమష్టి వైఫల్యమా! చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే ఆటకు ముందే మనోళ్లు గెలుపు ఖాయం అన్నట్లుగా కనిపించారు. పాత రికార్డులను ముందేసుకొని సరిపెట్టుకుంటూ కొత్తగా మారిన పాక్‌పై ఎలా ఆడాలనే సన్నద్ధత కనిపించలేదు. లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ ‘డకౌట్‌’ అందుకు చిన్న ఉదాహరణ మాత్రమే. 151 పరుగులు చేసినా... చివరకు ఒక్కరినీ అవుట్‌ చేయలేక 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం. 

న్యూజిలాండ్‌తో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయని తెలిసిన తర్వాత కూడా జట్టు అంతకంటే పేలవ ప్రదర్శన కనబర్చింది. మరీ 110 పరుగులకే పరిమితమైన తర్వాత ఇంకా గెలుపుపై ఆశలు మిగిలి ఉంటాయా! ఈసారి రోహిత్, కోహ్లి, రాహుల్‌ కలిసికట్టుగా విఫలం కావడంతో అసలు స్కోరు బోర్డు ముందుకే సాగలేదు. ఆపై అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలపై ఎంత ప్రతాపం చూపించినా అంతా విఫలప్రయత్నమే!  

టాప్‌ ఆటగాళ్ల వైఫల్యాలతో పాటు సగం ఫిట్‌నెస్‌తో ఉన్న భువనేశ్వర్, హార్దిక్‌ పాండ్యాలను భారత్‌ బలవంతంగా కొనసాగించింది. ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ ఎంపికనే ఒక పెద్ద మిస్టరీలాగా అనిపించింది. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడిన చహల్‌ను పరిగణలోకి తీసుకోకుండా రాహుల్‌ చహర్‌పైనే నమ్మకముంచిన మేనేజ్‌మెంట్‌ నాలుగు మ్యాచ్‌లలో అవకాశమే ఇవ్వలేదు.

తాను అలసిపోయినట్లు బుమ్రానే స్వయంగా చెప్పగా, ఈ ఫార్మాట్‌కు తాను పనికిరానని షమీ నిరూపించేశాడు. అయితే టాస్‌ను, మంచును నిందించి లాభం లేదు. వీటి ప్రభావం తొలుత బ్యాటింగ్‌ చేయడంపై ఎలాగూ ఉండదు. కనీస స్కోరు కూడా చేయనప్పుడు దిగ్గజ బౌలర్లు కూడా మ్యాచ్‌లను రక్షించలేరు. 

ఓవరాల్‌గా చూస్తే మన బ్యాటింగ్‌లో పదును లేకపోవడంతో ఈ ని్రష్కమణకు కారణమైంది. సగటు అభిమానులు తాజా ఫలితంపై బాధపడిపోతుండవచ్చు కానీ ఆటగాళ్ల కోణంలో చూస్తే ఇది మరో టోర్నీ మాత్రమే. కనీసం వారు కూడా తప్పుప్పొలను బేరీజు వేసుకునే సమయం కూడా లేకుండా వచ్చే బుధవారం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌కు సిద్ధం కావాల్సిందే. ప్రదర్శన ఎలా ఉన్నా భారత క్రికెట్‌ నిరంతర ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది.   

 

చివరగా... మెంటార్‌ హోదాలో భారీ ఎంట్రీ ఇచ్చిన ధోని ఈ టోర్నీలో సరిగ్గా ఎలాంటి పాత్ర పోషించాడో ఎవరైనా చెప్పగలరా!  

చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్‌.. ఆరోజే గనుక వస్తే క్రికెట్‌ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement