ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో మెంటార్ రోల్‌ను పోషిస్తున్నాడు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ధోనిని మెంటార్‌గా తీసుకుంది బీసీసీఐ. ఇటు భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, అటు ఐపీఎల్‌లో సీఎస్‌కేకు నాలుగు టైటిల్స్ అందించిన సారథిగా ఉన్న ధోనిని మెంటార్‌గా నియమించుకోవడం సబబే. ప్రధానంగా ధోనిని తీసుకోవడం వెనుక కోహ్లి కూడా ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఫైనల్‌కు చేరిన తర్వాత కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడం ఆపై టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం జరిగిపోయాయి.
కోహ్లి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం?
గతవారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ధోని-కోహ్లిల గురించి తీవ్ర చర్చ నడిచింది. నెటిజన్లు ఒక్కోక్కరూ తలో విధంగా స్పందిస్తూ ఈ ఇద్దరే గురించే ఎక్కువ కామెంట్ చేశారు. పాక్‌తో మ్యాచ్‌లో భాగంగా ఇషాన్ కిషన్ ద్వారా పంపిన సలహాలు, సూచనలు విరాట్ కోహ్లి పాటించలేదనే దానిపై చర్చ నడిచింది.. కోహ్లితో పాటు రిషభ్ పంత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్ ఏదో చెప్పగా, దానికి కోహ్లి మరొకటి చెప్పాడు. తాను ఔటైతే హార్దిక్ పాండ్యాను తర్వాత పంపమని, ఒకవేళ రిషభ్ అయితే రవీంద్ర జడేజాను పంపమనే సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే వీరిద్దరిలో ఎవరు ఔటైనా హార్దిక్‌నే తర్వాత పంపుదామనే ధోని సలహాను ఇషాన్ తీసుకురాగా, దానికి కోహ్లి కాస్త భిన్నంగా స్పందించాడాని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కోహ్లి ప్రత్యేకంగా ఇషాన్‌ను పిలిచి మరీ చెప్పడం ధోని సలహాను వ్యతిరేకించాడనే దానికి మరింత బలం చేకూర్చేదిగా ఉందని అభిమానుల అభిప్రాయంగా ఉంది.
వరుణ్‌ను ధోని వద్దన్నాడా?
ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆడపా దడపా భారత జట్టులోకి వస్తున్న లెగ్ బ్రేక్ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. అంతర్జాతీయంగా ఇంకా నిరూపించుకోలేకపోయాడు. ఇంకా పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్న వరుణ్‌ను.. వరల్డ్ టీ20కి ఎంపిక చేశారు. కానీ పాకిస్తాన్‌తో పోటీకి వరుణ్‌ను వద్దనే ధోని అన్నాడనే టాపిక్ వచ్చింది. పెద్దగా అనుభవం లేని వరుణ్ కంటే, రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేస్తే మంచిదని ధోని ఒక మెంటార్‌గా చెప్పాడనేది వీరి భావన.
కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో వరుణ్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాంతో వరుణ్ వైపే మొగ్గుచూపాడు కోహ్లి. కానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని వరుణ్ ఎంపిక సరైనది కాదనేది మ్యాచ్ తర్వాత తేటతెల్లమైంది. వరుసగా గాయాల బారిన పడుతున్న వరుణ్ ఎంపికపై ఆదినుంచి డైలమా ఉంది. అతన్ని తీసుకోవాలా వద్దా.. అనే సందిగ్థంలోనే పాక్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్ ఆడేశాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా కోహ్లి తప్పుచేశాడనే వాదన తెరపైకి వచ్చింది. దీనిపై అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన వరుణ్..వికెట్లేమీ తీయకుండా 33 పరుగులిచ్చాడు. కోహ్లికి జట్టును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అందులో ధోని తలదూర్చే అవకాశం దాదాపు ఉండదనేది ఒక వాదన. మరి ధోని-కోహ్లిల మధ్య అంతర్గతంగా ఏమి జరిగిందనే వారికే తెలియాలి.
మార్పులు తప్పవా?
ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మిగిలిఉన్న మ్యాచ్‌లు టీమిండియాకు కీలకం. దాంతో కివీస్‌తో ఆదివారం(ఆక్టోబర్ 31) మ్యాచ్‌కు భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో ఆడేది అనుమానంగానే ఉంది. వీరిద్దరూ రాణించడం విషయాన్ని పక్కన పెడితే, పాక్ జట్టును పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు.మరొకవైపు షమీ కూడా రాణించలేదు. కానీ టీమిండియా పేస్ విభాగంలో భువీని తప్పించి అతని స్థానంలో శార్దూల్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేస్తున్నప్పుడు తానొక బ్రేక్-త్రూ బౌలర్ అనే విషయాన్ని శార్దూల్ చాలాసార్లు నిరూపించుకున్నాడు. దాంతో శార్దూల్, అశ్విన్‌లు తుదిజట్టులో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది.
కివీస్‌తో మ్యాచ్‌కు వరుణ్ వద్దే వద్దు!
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు వరుణ్ వేసుకోవద్దని ఇప్పటికే మాజీలు సలహాలు ఇవ్వడం షురూ చేశారు. ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే కానీ వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్‌లో, అందులోనూ కివీస్‌తో కీలకమైన మ్యాచ్‌కు వరుణ్ తీసుకుని మళ్లీ తప్పుచేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తేల్చిచెప్పాడు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమం అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా అంతర్జాతీయ క్రికెట్ అనేది భిన్నమైనదని పేర్కొన్నాడు. ‘కీలకమైన మ్యాచ్‌లు టీమిండియా ముందున్న తరుణంలో వరుణ్‌ను పక్కన పెట్టండి. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్లు పెద్దగా రాణించలేరు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ విషయం నిరూపితమైంది. స్పిన్నర్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు’ అని దిలీప్ దోషి పేర్కొన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లు తమ గత ఫామ్‌ను అందుపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment