Saba Karim Picks His Semifinalists: క్రికెట్ అభిమానులను అలరించేందుకు రెండు మెగా ఈవెంట్లు సిద్ధమవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 వరల్డ్‌కప్ రూపంలో రానున్న రెండున్నర నెలల కాలం కావాల్సినంత వినోదం లభించనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్- 2021 విజేత గురించి అంచనా వేస్తున్న మాజీ క్రికెటర్లు.. టీ20 ప్రపంచకప్ విన్నర్‌పై కూడా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఇప్పటికే టాప్- 4 జట్లను ప్రకటించగా.. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ సబా కరీం సైతం ఈ జాబితాలో చేరాడు.
డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌కు అగ్రతాంబూలం వేసిన సబా కరీం.. ఇంగ్లండ్, టీమిండియాకు కూడా సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య పోటాపోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా.. గత టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్... ఈసారి కూడా ఆ ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశం ఉంది. ఇతర జట్లకు గట్టి పోటీనిస్తుంది.
ఇక 2016లో పొట్టి ఫార్మాట్ మెగా ఈవెంట్‌లో ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచి మంచి జోరు మీద ఉంది. టీమిండియా విషయానికొస్తే... టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో భారత జట్టు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ మూడూ సెమీస్ చేరడం ఖాయం అనుకుంటే.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య నాలుగో స్థానం కోసం పోటీ తప్పదు. అయితే, సౌతాఫ్రికాకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment