
ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు క్రికెట్ పాలిట విలన్‌లా తయారయ్యాయి. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అభిమానులకు తెగ చిరాకు తెప్పిస్తున్నాయి. టీమిండియా, ఇంగ్లండ్ జట్లు విండీస్, ఆసీస్‌లపై గెలవాల్సిన మ్యాచ్‌లు వర్షాల కారణంగా డ్రాగా ముగియడంతో ఇరు దేశాల ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తాజాగా మరో మ్యాచ్ కూడా వర్షానికి బలయ్యేలా కనిపిస్తుంది. పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కేవలం 10 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆట రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (87), బాబర్ ఆజమ్ (28) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ 12 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ముగిసిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం ఆఖరి రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టేయడంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ డ్రాతో సర్దుకోవాల్సి వచ్చింది. ఆఖరి రోజు మరో 5 వికెట్లు తీస్తే ఇంగ్లండ్ మ్యాచ్ గెలవడంతో పాటు యాషెస్ అవకాశాలను కూడా సజీవంగా ఉంచుకుని ఉండేది. కానీ, ఇంగ్లండ్ యాషెస్ అవకాశాలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
దీనికి ఒక రోజు తర్వాత (జులై 24) టీమిండియాను సైతం వర్షం ఇలాగే ముంచింది. గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా డ్రాతో సరిపెట్టుకుంది. విండీస్‌తో రెండో టెస్ట్ ఆఖరి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. ఆఖరి రోజు బౌలర్లు మరో 8 వికెట్లు తీసుంటే టీమిండియా మ్యాచ్ గెలిచి, సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసేది. వరుణుడు టీమిండియాను దెబ్బకొట్టి, క్లీన్‌స్వీప్ కాకుండా విండీస్‌ను కాపాడాడు.
Comments
Please login to add a commentAdd a comment