టి20 ప్రపంచకప్ తొలిరౌండ్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ ‘సూపర్–12’కు ప్రధాన టోర్నీకి అర్హత సంపాదించాయి. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ లంకను కంగు తినిపించిన నమీబియా సంచలన ప్రదర్శన చివరకు పేలవంగా ముగిసింది.
యూఏఈపై గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిన నమీబియా... నెదర్లాండ్స్ ముందుకెళ్లే అవకాశాన్నిచ్చింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. సాయంత్రం ముగిసిన పోరులో యూఏఈ 7 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. లంక గెలిచి అర్హత సాధించగా, ఓడిన నెదర్లాండ్స్ కూడా ఇదివరకే రెండు విజయాలతో ముందంజ వేసింది. నమీబియా గెలిస్తే నెదర్లాండ్స్ కథ ముగిసేది.
గీలాంగ్: నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండిస్ (44 బంతుల్లో 79; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. మ్యాక్స్ ఓ డౌడ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరిపోరాటం చేశాడు.
లంక ఇన్నింగ్స్ నిదానంగా మొదలైంది. పవర్‌ప్లేలో నిసాంక (14; 1 ఫోర్), మెండీస్ జోడీ చేసింది 36 పరుగులే! అదే స్కోరుపై నిసాంక, ధనంజయ డిసిల్వా (0)... మీకెరెన్ వేసిన ఏడో ఓవర్లో పెవిలియన్ చేరారు. ఈ దశలో కుశాల్, చరిత్ అసలంక (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు వేగంగా పరుగులు జత చేశారు. 9వ ఓవర్లో 50 పరుగులు చేసిన లంక, కుశాల్ సిక్సర్లతో విరుచుకుపడటంతో 14.3 ఓవర్లలోనే 100 స్కోరు దాటింది.
కుశాల్ 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భానుక రాజపక్స (13 బంతుల్లో 19; 2 ఫోర్లు) వచ్చాక స్కోరు వేగం మరింత పుంజుకుంది. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక (8), కుశాల్ మెండిస్‌లు వెనుదిరగడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మీకెరెన్, బస్ డి లీడె చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం నెదర్లాండ్స్ జట్టులోనూ ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ కడదాకా పోరాటం చేసినా లంక బ్యాటర్స్‌లా అండగా నిలిచే సహచరులు కరువయ్యారు. అతని తర్వాత రెండో అత్యధిక స్కోరు కెప్టెన్ ఎడ్వర్డ్స్ (21)దే! మిగతావారిలో ముగ్గురు డకౌటైయ్యారు. లెగ్ స్పిన్నర్ హసరంగ (3/28) ప్రత్యర్థిని పడగొట్టగా, తీక్షణ 2, లహిరు, ఫెర్నాండో చెరో వికెట్ తీశారు.
వీస్ పోరాడినా...
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గట్టి ప్రత్యర్థి, ఆసియా చాంపియన్ శ్రీలంకపై నమీబియా 163/7 స్కోరు చేసింది. 55 పరుగులతో సంచలన విజయం సాధించింది. కానీ సూపర్–12కు అర్హత సాధించే ఆఖరి మ్యాచ్‌లో క్రికెట్‌కూన యూఏఈ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరిదాకా పట్టుదల కనబరిచిన యూఏఈ చివరకు 7 పరుగుల తేడాతో గెలిచి ఈ గ్రూప్‌లో ఒక విజయంతో నిష్క్రమించింది.
నమీబియాకు కీలకమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముహమ్మద్ వసీమ్ (41 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు), వ్రిత్యా అరవింద్ (32 బంతుల్లో 21; 2 ఫోర్లు) నమీబియా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆరంభంలో కష్టపడ్డారు. దీంతో 8 ఓవర్లు ముగిసినా జట్టు స్కోరు 39 పరుగులను దాటలేదు.
అరవింద్ అవుటయ్యాక... కెప్టెన్ రిజ్వాన్ (29 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే యూఏఈ స్కోరు పుంజుకుంది. వసీమ్, రిజ్వాన్ రెండో వికెట్‌కు 6.5 ఓవర్లలో 58 పరుగులు జోడించారు. ఆఖర్లో బాసిల్ హమీద్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీషాట్లతో మెరిపించడంతో యూఏఈ పోరాడే స్కోరు చేయగలిగింది. నమీబియా బౌలర్లు డేవిడ్ వీస్, బెర్నార్డ్, షికొంగో తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి ఓడిపోయింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా ఆరంభం నుంచే అగచాట్లు పడింది. ఓపెనర్లు మైకేల్ లింగెన్ (10), స్టీఫన్ (4) సహా ఆరో వరుస బ్యాటర్ స్మిత్ (3) దాకా అంతా నిరాశపరిచారు. దీంతో 69 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన నమీబియాకు ఓటమి ఖాయమైంది. అయితే డేవిడ్ వీస్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టులో ఆశలు రేపాయి.
ఎనిమిదో వికెట్‌కు రుబెన్ ట్రంపుల్‌మన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వీస్ ఇద్దరు 7 ఓవర్లలో 70 పరుగులు జోడించడంతో నమీబియా గెలుపు వాకిట నిలిచింది. 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన సమీకరణం నమీబియాను ఊరించింది. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచేందుకు వీస్ ప్రయత్నించగా బౌండరీ వద్ద షరఫు అందుకోవడంతో యూఏఈకి గెలుపు ఖాయమైంది. ఈ ఫలితం నెదర్లాండ్స్‌కు లక్కీచాన్స్ అయ్యింది. మధ్యా హ్నం ఓటమి తాలుకు నిరాశ సాయంత్రమయ్యేసరికి సంతోషంగా మారింది. యూఏఈ మ్యాచ్ అయిపోగానే నెదర్లాండ్స్ సంబరాల్లో మునిగితేలింది.
గ్రూప్‘బి’ తేలేది నేడే
గ్రూప్ ‘ఎ’ లెక్క తేలింది. మిగిలింది ‘బి’ గ్రూపు లెక్కే! ఇక్కడ నాలుగు జట్లకు సమాన అవకాశాలున్నాయి. స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లన్నీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గెలుపోటములతో రేసులో ఉన్నాయి. నేడు ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్‌తో ఐర్లాండ్... స్కాట్లాండ్‌తో జింబాబ్వే తలపడతాయి. గెలిస్తే చాలు... ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా గెలిచిన రెండు జట్లు ‘సూపర్–12’ దశకు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment